కొండాలమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి శోభ
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు... సీజీఎఫ్ నిధులతో నిర్మించిన కాలక్షేప మండపం ప్రారంభం... అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే రాము

గుడ్లవల్లేరు, అక్టోబర్ 11: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని కలశ స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. పూజల అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీజీఎఫ్ నిధులతో నిర్మించిన కాలక్షేప మండప భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ మండపం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక సమావేశాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేమవరం కొండాలమ్మ ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రమని, ఇక్కడ నిర్వహించే నవరాత్రి వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయని అన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో గుడివాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రజలంతా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకుడు పోలవరపు వెంకటరావు, ఆలయ చైర్మన్ ఈడే మోహన్, ఈవో ఆకుల కొండలరావు, నాయకులు కొడాలి రామరాజు, చేకూరు జగన్మోహనరావు, వెనిగళ్ల నాగేశ్వరరావు, వల్లభనేని రంగబాబు, పెన్నేరు రమేష్, పెద్దిపోయిన రాజు, బొప్పన శివప్రసాద్, సుబ్బారెడ్డి, తోట మల్లి, వల్లభనేని సుబ్బారావు, అట్లూరి స్వరూప్, గోవాడ శివ, కంచర్ల ప్రకాష్, జోజి, అబ్దుల్ సత్తార్, కళ్యాణపు నవాబు, ఈడే కృష్ణ, తూము పద్మజ, ఏడుకొండలు, జనసేన నాయకులు తోట చిన్నారి, అడపా బాబి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

