రాష్ట్రపతి పర్యటనకు బెజవాడలో హైఅలర్ట్!
14, 15 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటన... 13న తమిళనాడు ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు... కాన్వాయ్ మార్గాల్లో నిఘా.. ట్రాఫిక్ మళ్లింపునకు ముందస్తు ప్రణాళిక...

విజయవాడ, అక్టోబర్ 12: భారత రాష్ట్రపతి, తమిళనాడు ముఖ్యమంత్రి వరుస పర్యటనల నేపథ్యంలో విజయవాడలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, 13న తమిళనాడు ముఖ్యమంత్రి నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రముఖుల పర్యటనలకు సంబంధించిన భద్రత, కాన్వాయ్ నిర్వహణ, రూట్‌మ్యాప్‌లు, సభా ప్రాంగణాలు, బస చేసే ప్రాంతాల వద్ద బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. రాష్ట్రపతి పర్యటించే మార్గాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కంట్రోల్ రూమ్ అధికారులకు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు రాష్ట్రపతి కాన్వాయ్ ప్రయాణించే సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే గుర్తించాలని ట్రాఫిక్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ భద్రతా విధులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సైతం సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐజీ అంబురాజన్, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, తిరుమలేశ్వరరెడ్డి, షిరిన్ బేగం, కె.జి.వి. సరిత, కృష్ణప్రసన్న, లక్ష్మీనారాయణతో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

