కూటమి అభ్యర్థుల గెలుపుపై గద్దె క్రాంతి కుమార్ ధీమా
వంగవీటి రాధాకు లక్షకు పైగా ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా… తూర్పులో ఏడు డివిజన్ల అభ్యర్థుల నామినేషన్లకు హాజరు… ఐక్యంగా పనిచేయాలని కూటమి శ్రేణులకు పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 18: నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకు లక్షకు పైగా ఓట్ల మెజార్టీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి బలపరిచిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 2వ డివిజన్ అభ్యర్థిని పర్వతనేని రత్నశ్రీ, 8వ డివిజన్ అభ్యర్థి పెనుగొండ శ్రీనివాస్, 16వ డివిజన్ అభ్యర్థి కిలారు నాగశ్రావణ్, 17వ డివిజన్ అభ్యర్థి కోనేరు రాజేష్, 24వ డివిజన్ అభ్యర్థిని రత్నం రజినీ, 25వ డివిజన్ అభ్యర్థి కట్టా అమర్నాథ్, 30వ డివిజన్ అభ్యర్థి గొరిపర్తి నామేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నగరాభివృద్ధిని వేగవంతం చేసేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని క్రాంతి కుమార్ కోరారు. ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

