విధుల్లోనే ఆగిన పోలీసు గుండె
ఛలో విజయవాడ బందోబస్తులో కుప్పకూలిన సీఐ అహమ్మద్ అలీ ఆంధ్ర ఆసుపత్రికి తరలించిన అధికారులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి

విజయవాడ , సెప్టెంబర్ 27 : విజయవాడ నున్న పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అహమ్మద్ అలీ ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. నగరంలోని ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా బందోబస్తు విధులు నిర్వర్తిస్తుండగా ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలారు. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు అహమ్మద్ అలీని విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న సీఐ ఆకస్మిక మరణంతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.

