టీడీపీ సమావేశంలో పెట్రోల్ కలకలం!
ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆరోపణలు… పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఇద్దరు కార్యకర్తల ప్రయత్నం… కన్నీటిపర్యంతమైన ఎంపీటీసీ అభ్యర్థి.. విచారణకు డిమాండ్…

తాడేపల్లిగూడెం, నవంబర్ 9: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ అభ్యర్థి పరిమి రవికుమార్ ఓటమికి సొంత పార్టీ నాయకులే కారణమంటూ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, అక్కడున్న నాయకులు అడ్డుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో తనను గెలిపించాల్సిన నాయకులే ఓటమికి కారణమయ్యారని ఆరోపిస్తూ రవికుమార్ సమావేశంలో కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నికల సమయంలో కొందరు పార్టీ నాయకుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ సునీల్ కుమార్ వ్యవహారశైలిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ, సంబంధిత కాల్ రికార్డులను పరిశీలించాలని కోరారు. ఎన్నికల పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళన, పరస్పర ఆరోపణలతో సమావేశంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగంగా వ్యక్తమవడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే రవికుమార్ చేసిన ఆరోపణలపై సంబంధిత నాయకులు, అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

