డయేరియాకు చెక్.. పరిశుభ్రతపై ఫోకస్
ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి... హోటళ్లు, ఫుడ్ కోర్టులు, స్టాల్స్, నీటి ట్యాంకుల్లో తరచూ తనిఖీలు చేపట్టాలి... కలుషిత ఆహారం, నీటిపై తక్షణ చర్యలు.. డయేరియా కేసులపై నిరంతర నిఘా...

విజయవాడ, ఆగస్టు 24: ప్రజారోగ్య పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆహారం, నీటి కాలుష్యంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ప్రజారోగ్యం, ఆహార భద్రత, తాగునీటి నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలోని హోటళ్లు, ఫుడ్ కోర్టులు, ఆహార విక్రయ స్టాల్స్‌తో పాటు నీటి ట్యాంకులను తరచూ తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అందించే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. తనిఖీల్లో లోపాలు గుర్తిస్తే సంబంధిత నిర్వాహకులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలుషిత నీటి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని చెప్పారు. ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా గుర్తిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో డయేరియా కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ ప్రాంతంలోనైనా కేసులు నమోదైతే వాటికి కారణాలను వెంటనే గుర్తించి వైద్య, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు

