శ్రీవారి ఆశీస్సులతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభం: ప్రతాప్ సీ రెడ్డి
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అపోలో చైర్మన్... అపోలో హాస్పిటల్స్ అభివృద్ధికి శ్రీవారి అనుగ్రహమే కారణమని వెల్లడి... ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఎంతో సహకరిస్తున్నారని ప్రశంస...

తిరుమల, అక్టోబర్ 29: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే అపోలో హాస్పిటల్స్‌ను ప్రారంభించామని ఆ సంస్థ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తన కుమార్తె ప్రీతారెడ్డి, మనవరాలు, సినీ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసనతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపల ప్రతాప్ సీ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహంతోనే అపోలో హాస్పిటల్స్ ప్రస్థానం ప్రారంభమైందని, సంస్థ అభివృద్ధిలో స్వామివారి ఆశీస్సులు ఎంతో కీలకమని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్స్ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో సహకారం అందిస్తున్నారని ప్రతాప్ సీ రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

