ప్రజా రక్షణకు ‘త్రిశూల్’
మాదకద్రవ్యాల నిర్మూలనతోపాటు మహిళల భద్రతపై దృష్టి… రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన… కొత్తపేటలో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 3: మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యాలుగా ‘త్రిశూల్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. త్రిశూల్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శనివారం సాయంత్రం కొత్తపేటలో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీజీ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రమణయ్య కూల్‌డ్రింక్ సెంటర్ వరకు కొనసాగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు, సిబ్బందితోపాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ

సందర్భంగా సీఐ కొండలరావు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి నిబంధనల మేరకు పారితోషికం అందజేస్తామని తెలిపారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజా భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొండలరావు పిలుపునిచ్చారు.

