విజయవాడలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం
అత్యవసర వైద్య సేవలనూ బహిష్కరించాలని నిర్ణయం... ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ సేవలకు అంతరాయం కలిగే అవకాశం... డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆరోగ్యశాఖకు జూడాల అల్టిమేటం...

విజయవాడ క్రైమ్ ఆగస్టు 17 (ఆంధ్రప్రభ): విజయవాడలో జూనియర్ డాక్టర్ల సమ్మె మరింత ఉధృతమైంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు అత్యవసర వైద్య సేవలను సైతం బహిష్కరించాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది.
ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ వంటి కీలక సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్సర్వీస్, ప్రైవేట్ కళాశాలల పీజీ వైద్యులు, సెకండరీ ఆసుపత్రుల వైద్యులను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖకు గడువు విధిస్తూ సమ్మెను మరింత ఉధృతం చేసినట్లు సమాచారం. జూనియర్ డాక్టర్ల ఆందోళన నేపథ్యంలో రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

