ఎంతో మందికి జీవం పోశాడు.. అవార్డు అందుకున్న 24 గంటల్లోనే కన్నుమూత
108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జహంగీర్ బాషా ఆకస్మిక మృతి... ఆగస్టు 15న కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న బాషా... మరుసటి రోజే గుండెపోటుతో మృతి.. కుటుంబంలో తీరని విషాదం...

గద్వాల, ఆగస్టు 17 (V10TV TS): అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమందికి సేవలందించి ప్రాణాలు కాపాడిన 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జహంగీర్ బాషా (27) ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గద్వాల జిల్లా చెనుగోనిపల్లికి చెందిన ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు ఆగస్టు 15న జహంగీర్ బాషా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆ సంతోషం కుటుంబంలో ఇంకా చెరిగిపోకముందే కేవలం 24 గంటల వ్యవధిలో ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సుమారు 2.30 గంటలకు బాషాకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సమయంలో ఎందరో బాధితులను ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడేందుకు సేవలందించిన వ్యక్తి ఇలా అకాలంగా కన్నుమూయడం విషాదకరంగా మారింది.

