‘ఇన్‌స్టా’ మిస్డ్‌కాల్.. కిడ్నాపర్‌కు చెక్!
గుంటూరు బాలిక అపహరణ కేసులో నిందితుడి అరెస్ట్... హరియాణాలోని కర్నాల్‌లో గుర్తించి అదుపులోకి... పది ఇన్‌స్టా ఖాతాల వినియోగం.. తరచూ స్థావరాల మార్పు...

గుంటూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా రాష్ట్రాలు మారుతూ తిరుగుతున్న బాలిక అపహరణ కేసు నిందితుడిని ఓ ‘ఇన్‌స్టా’ మిస్డ్‌కాల్ పట్టించింది. గుంటూరు నగరంలో పదో తరగతి చదువుతున్న బాలికను అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జాన్‌సైదాను పోలీసులు హరియాణా రాష్ట్రం కర్నాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు బాలికను గుర్తించి గుంటూరుకు తీసుకొస్తున్నారు.
జూన్ 9న బాలిక అదృశ్యమైనప్పటి నుంచి జాన్‌సైదా పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సాధారణ సెల్‌ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉంటూ ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. తరచూ ఖాతాలు, స్థావరాలు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తిరిగినట్లు సమాచారం.
మిస్డ్‌కాల్‌తో దొరికిన కీలక ఆధారం
బాలిక అదృశ్యంపై ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బాలిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తల్లిదండ్రులకు మిస్డ్‌కాల్ రావడం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ఆ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయినప్పటికీ, సాంకేతిక ఆధారాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
జాన్‌సైదా పదేపదే ఇన్‌స్టా ఖాతాలు మారుస్తున్నప్పటికీ అతడి కదలికలను గుర్తించిన పోలీసులు, హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో శుక్రవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒక్క రోజు వ్యవధిలోనే నిందితుడు రెండు ఇన్‌స్టా ఖాతాలు మార్చినట్లు గుర్తించారు. మొత్తంగా బాలిక మూడు, జాన్‌సైదా ఏడు ఇన్‌స్టా ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
వారం ముందే గుంటూరులో మకాం
బాలికను తీసుకెళ్లడానికి ముందు జాన్‌సైదా వారం రోజులపాటు గుంటూరులోని ఓ లాడ్జిలో బస చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆన్లైన్లో సెకండ్‌హ్యాండ్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేయడంతో పాటు సిమ్‌కార్డులు సమకూర్చుకుని, వాటి ద్వారా బాలికతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
బాలిక ఇంటి నుంచి వెళ్లే సమయంలో సెల్‌ఫోన్‌లోని సందేశాలను తొలగించి, ఫోన్‌ను మురుగు కాలువలో పడేసినట్లు సమాచారం. అనంతరం జాన్‌సైదా బాలికను ద్విచక్ర వాహనంపై నెల్లూరుకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.
రాష్ట్రాలు మారుతూ పరారీ
నెల్లూరు నుంచి ఆదోని, చెన్నై, కోయంబత్తూరు, కేరళ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఓ బంధువు ఇంట్లో ఆశ్రయం పొందడంతో పాటు పలు దుకాణాల్లో బంగారం విక్రయించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆ తర్వాత కూడా స్థావరాలు మారుస్తూ చివరకు హరియాణాకు చేరుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుడికి కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి సహకారం అందిందా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. జాన్‌సైదాపై పర్చూరు పోలీస్‌స్టేషన్‌లో 2025లో నమోదైన దాడి కేసు కూడా ఉన్నట్లు సమాచారం.
నిందితుడు, బాలికను గుంటూరుకు తీసుకొచ్చిన అనంతరం పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

