మంగళగిరిలో వైసీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం
నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల సోమిరెడ్డి… స్థానిక, పురపాలక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన… ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా…

మంగళగిరి, అక్టోబర్ 2: మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఆఫ్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, మాజీ సమన్వయకర్త వేమారెడ్డితోపాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేణుగోపాల సోమిరెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వేణుగోపాల సోమిరెడ్డి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందన్నారు. ఎలాంటి ఎన్నికలనైనా ధైర్యంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, మంగళగిరి నుంచి పార్టీ అధినేతకు ఘన విజయాన్ని కానుకగా అందిస్తామని వేణుగోపాల సోమిరెడ్డి పేర్కొన్నారు.

