చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా
గుండె సమస్యతో బాధపడుతున్న నవజాత శిశువుకు వైద్య సహాయం కోరిన బహుజన సేన... ఆశ్రం ఆస్పత్రి యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే... అధైర్యపడొద్దు నేనున్నానంటూ చిన్నారి కుటుంబానికి భరోసా...

ఏలూరు, అక్టోబర్ 22, 2024: గుండెలో రంధ్రం ఉన్న నవజాత శిశువుకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆశ్రం ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. చిన్నారి వైద్య సహాయం కోసం బహుజన సేనాని మత్తే బాబి, బహుజన సేన బృందం సభ్యులు ఎమ్మెల్యేను కలిసి పరిస్థితిని వివరించారు. వారి విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటి వెంటనే ఆశ్రం ఆస్పత్రి అధికారులతో ఫోన్లో మాట్లాడి చిన్నారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు. శిశువు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చికిత్స విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధైర్యపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చిన్నారి వైద్య చికిత్సకు సంబంధించి ఎలాంటి సహాయం అవసరమైనా తనను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటికి చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు బహుజన సేన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

