హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం
మణికొండలోని అపార్ట్‌మెంట్‌లో చోరీ... అడ్డుకున్న మహిళపై దాడి చేసి పరారీ... మూడు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు...

హైదరాబాద్, సెప్టెంబర్ 28: హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ మరోసారి కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దుండగులు ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళపై దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యారు. అపార్ట్‌మెంట్‌లోని ఓ బ్లాక్‌లో ఆరుగురు అనుమానితులు సంచరిస్తున్న దృశ్యాలు నిఘా కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ ముఠాకు అపార్ట్‌మెంట్ భద్రతా సిబ్బందితో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

