నిబద్ధతకు నిలువుటద్దం రేడపొంగు యాకోబు
సీపీఐ సీనియర్ నాయకుడి మృతికి పార్టీ నేతల సంతాపం... భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి ఘన నివాళి... నగర పార్టీకి ఆయన మృతి తీరని లోటన్న నక్క వీరభద్రరావు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 30: భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి సీనియర్ నాయకుడు రేడపొంగు యాకోబు మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. యాకోబు నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతకు నిలువుటద్దంలాంటి వ్యక్తి అని సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు కొనియాడారు. యాకోబు మరణవార్త తెలుసుకున్న సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు కడప నుంచి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. నగర పార్టీ నాయకులు యాకోబు స్వగృహానికి చేరుకుని నివాళులర్పించారు. నక్క వీరభద్రరావు ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. యాకోబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. డెబ్బయ్యవ దశకం చివరిలో కమ్యూనిస్టు నాయకులు తమ్మిన పోతరాజు, ఉప్పలపాటి రామచంద్రరావు స్ఫూర్తితో యాకోబు యువజన సమాఖ్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనేకమంది యువకులను కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. నరసింహరాజు, ఆర్ ఐజాక్ ప్రోత్సాహంతో అప్పటి నాలుగో

డివిజన్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషిచేశారు. మున్సిపల్ ఉద్యోగిగా పనిచేసిన ఆయన ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నగర ఉపాధ్యక్షుడిగా, మున్సిపల్ ఎంప్లాయీస్ సహకార బ్యాంకు డైరెక్టర్‌గా సేవలందించారు. టైనర్‌పేట అభివృద్ధితోపాటు స్థానిక ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చడంలో యాకోబు విశేషంగా కృషిచేశారు. పలువురు కార్పొరేటర్లు, శాసనసభ్యుల విజయానికి కీలకంగా పనిచేశారు. నగర కార్యవర్గ సభ్యుడిగా, పార్టీ కోశాధికారిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగడమే నిజమైన నివాళి అని వీరభద్రరావు పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో మూలి సాంబశివరావు, తాడి పైడయ్య, కొట్టు రమణారావు, సంగుల పేరయ్య, డీవీ రమణబాబు, తూనం వీరయ్య, కొడాలి ఆనందరావు, ఎస్‌కే నజీర్, ఆర్ పిచ్చయ్య, రేడపొంగు ప్రభుదాస్, రాయన గుర్నాథం, కుర్ర శివయ్య, కరోతి వెంకటేశ్వరరావు, రాచకుల శ్రీనివాసరావు, కొండపల్లి కృష్ణ తదితరులు ఉన్నారు.

