ముంపు ప్రాంతాల్లో సీపీఎం నేతల పర్యటన
సింగ్‌నగర్, పాయకాపురం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు దెబ్బతిన్న గృహాలను పరిశీలించి బాధితులను పరామర్శించిన సీపీఎం నేతలు డ్రైనేజీ పునర్నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని బాబూరావు డిమాండ్

విజయవాడ, సెప్టెంబర్ 24: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురంలోని ఎల్‌బీఎస్ నగర్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్ నగర్, కండ్రిక కాలనీ తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి గురువారం ఆయన పర్యటించారు. కాలనీల్లో నిలిచిన నీటిని, ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని, దెబ్బతిన్న గృహాల స్లాబులను పరిశీలించారు. స్థానికులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షంతో రహదారులు, లోబ్రిడ్జిలు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని బాబూరావు పేర్కొన్నారు. కొన్ని ఇళ్లలోకి నీరు చేరడంతో వంట చేసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. పలు గృహాల స్లాబుల పెచ్చులు ఊడిపడుతున్నాయని, అవి ప్రమాదకరంగా మారాయని తెలిపారు. కొండ ప్రాంతాల ప్రజలు కొండచరియలు విరిగిపడతాయేమోనన్న భయంతో జీవిస్తున్నారని చెప్పారు. వర్షాల కారణంగా చిరువ్యాపారులు, అసంఘటిత కార్మికులకు పనులు లేక జీవనం కష్టంగా మారిందన్నారు. విజయవాడలో చిన్నపాటి వర్షానికే రహదారులు, కాలనీలు మునిగిపోవడం డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. గతంలో కాలువల నిర్మాణానికి రూ.460 కోట్లు మంజూరైనా పూర్తిస్థాయిలో పనులు జరగలేదని ఆరోపించారు. బుడమేరు వరదల తరువాత కూడా ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టలేదన్నారు.

