ఉద్యోగ బాధ్యతల మధ్యే జాతీయ వేదికకు నాగ సతీష్
పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీలకు పోస్టల్ ఉద్యోగి ఎంపిక... రాష్ట్రస్థాయి ట్రయల్స్‌లో ప్రతిభతో జాతీయ పోటీలకు అర్హత... అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఉత్తరప్రదేశ్‌లో పోటీలు...

మచిలీపట్నం, ఆగస్టు 25: కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు గ్రామానికి చెందిన, గుడ్లవల్లేరు సబ్ పోస్టాఫీసులో అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ. నాగ సతీష్ జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు.
సాధారణ ఉద్యోగి.. అసాధారణ ప్రతిభ
నాగ సతీష్ సాధించిన విజయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన స్పోర్ట్స్ కోటా ద్వారా కాకుండా సాధారణ నియామక ప్రక్రియలో తన విద్యార్హతలు, ప్రతిభ ఆధారంగా పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందారు. ప్రతిరోజూ పూర్తిస్థాయి కార్యాలయ విధులు నిర్వహిస్తూనే పవర్ లిఫ్టింగ్‌లో కఠోర సాధన కొనసాగిస్తున్నారు. ఓపెన్ నేషనల్ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులతో పోటీపడి జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.
ఇటీవల గాయానికి గురైనప్పటికీ కోలుకుంటూనే సాధన కొనసాగించి జాతీయస్థాయి అవకాశాన్ని దక్కించుకోవడం ఆయన క్రీడాస్ఫూర్తికి నిదర్శనమని పలువురు అభినందిస్తున్నారు.
అధికారుల ప్రోత్సాహం మరువలేనిది
ఈ సందర్భంగా నాగ సతీష్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రీడా సాధనను సమన్వయం చేసుకోవడం సవాలుతో కూడుకున్నదని తెలిపారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకునే సమయంలో సాధన కొనసాగించడం కష్టంగా ఉన్నప్పటికీ మచిలీపట్నం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బి. శ్రీనివాసరావు అందించిన ప్రోత్సాహం ఎంతో ధైర్యాన్నిచ్చిందన్నారు.
సూపరింటెండెంట్ స్వయంగా క్రీడాకారుడు కావడంతో తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, సాధనకు ఇబ్బంది కలగకుండా విధుల విషయంలో సహకరించారని తెలిపారు. అలాగే గుడ్లవల్లేరు పోస్ట్ మాస్టర్ పి.వి. రాజకుమార్ నిరంతరం క్రీడల వైపు ప్రోత్సహిస్తూ కార్యాలయ విధుల పరంగా పూర్తి సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు.
అధికారుల ప్రోత్సాహం, సహకారం ఇచ్చిన మానసిక ధైర్యంతోనే ఓపెన్ నేషనల్ స్థాయి క్రీడాకారులతో పోటీపడి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశం లభించిందని నాగ సతీష్ పేర్కొన్నారు.
జాతీయస్థాయిలో పతకమే లక్ష్యం
జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాగ సతీష్ అద్భుత ప్రతిభ కనబరిచి పతకం సాధించాలని, తద్వారా మచిలీపట్నం పోస్టల్ డివిజన్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని పోస్టల్ సూపరింటెండెంట్ బి. శ్రీనివాసరావు ఆకాంక్షించారు.
నాగ సతీష్ జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై మచిలీపట్నం డివిజన్ ఉన్నతాధికారులు, గుడ్లవల్లేరు పోస్టల్ సిబ్బంది, పసుమర్రు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే క్రీడారంగంలో రాణిస్తున్న నాగ సతీష్ ప్రతిభ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

