గన్నవరంలో ఘనంగా యార్లగడ్డ జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే కార్యాలయానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు… భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించిన ప్రభుత్వ విప్… కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం, అక్టోబరు 4: ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జన్మదిన వేడుకలు ఆదివారం గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చారు. యార్లగడ్డ వెంకట్రావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఆయన కట్ చేశారు. యార్లగడ్డకు ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభించాలని పలువురు ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఎమ్మెల్యే కార్యాలయం సందడిగా మారింది. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన

ప్రతి ఒక్కరినీ యార్లగడ్డ ఆప్యాయంగా పలకరించారు. తనపై ప్రేమాభిమానాలు చూపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జన్మదినాన్ని పురస్కరించుకుని యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయన కుటుంబానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు యార్లగడ్డ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని కోరుకున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.

