తుఫాన్ వేళ ఏపీకి తెలంగాణ ఆపన్నహస్తం!
విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు తెలంగాణ సహకారం... అదనపు సిబ్బంది, సామగ్రి పంపాలని మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి... సానుకూలంగా స్పందించిన తెలంగాణ విద్యుత్ శాఖ...

అమరావతి, అక్టోబర్ 28 : 'అర్నబ్' తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను వేగంగా పునరుద్ధరించేందుకు అవసరమైన అదనపు సిబ్బంది, సామగ్రిని పంపించాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతిన్న పక్షంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ సానుకూలంగా స్పందించింది. అవసరమైన సహాయక బృందాలు, విద్యుత్ సామగ్రిని ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు అంగీకారం తెలిపింది. మరోవైపు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రి గొట్టిపాటి మాట్లాడి విద్యుత్ పునరుద్ధరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల సమన్వయంతో విద్యుత్ సరఫరాను సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు.

