గుడివాడ రూరల్‌లో అభివృద్ధి పరుగులు.. రూ.కోటికి పైగా రోడ్డు పనులకు శ్రీకారం
లింగవరంలో రూ.71 లక్షలతో అప్రోచ్ రోడ్డు.. రూ.3 లక్షలతో తాగునీటి బోర్ ప్రారంభం... మోటూరులో రూ.40 లక్షలతో రైల్వేస్టేషన్ రోడ్డు.. భూమిపూజ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... గ్రామీణ ప్రధాన రహదారులకు రూ.11 కోట్ల SASKI నిధులు.. పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే...

గుడివాడ రూరల్, ఆగస్టు 28: గుడివాడ నియోజకవర్గంలో వరుసగా మూడో రోజు అభివృద్ధి పనులు కొనసాగాయి. గుడివాడ రూరల్ మండలంలోని లింగవరం, మోటూరు గ్రామాల్లో కోటి రూపాయలకు పైగా SASKI నిధులతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.
లింగవరం గ్రామంలో రూ.71 లక్షల SASKI నిధులతో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా రూ.3 లక్షల SDS నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి బోరును ప్రారంభించారు. మోటూరు గ్రామంలో రూ.40 లక్షలతో చేపట్టనున్న రైల్వేస్టేషన్ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యే రాముకు స్థానిక నాయకులు, మహిళలు, యువత స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గ్రామాల్లో రహదారుల సమస్య ప్రధానంగా తన దృష్టికి వస్తోందన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని, అందుకే అందుబాటులో ఉన్న ప్రతి పథకం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రధాన గ్రామీణ రహదారుల కోసం ఇప్పటికే రూ.11 కోట్ల SASKI నిధులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం కావని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. “సమస్యలు ఆకాశమంత ఉన్నాయి.. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. కొంత ఆలస్యం కావచ్చు కానీ సమస్యలను వదిలిపెట్టం” అని పేర్కొన్నారు.
మోటూరులో రాజకీయ వేడి
మోటూరు గ్రామసభలో ఎమ్మెల్యే రాము గత ప్రభుత్వ హయాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన మట్టి దోపిడీ జరిగిందని, అరాచకాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అయితే గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవడం కంటే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నదే ప్రస్తుతం ముఖ్యమన్నారు.
గ్రామ చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు రాజకీయ ఉద్దేశాలతో అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధికి ఎదురయ్యే అడ్డంకులను ప్రజల సహకారంతో అధిగమించాలని కోరారు.

