విదేశీయుల బస వివరాలు నమోదు తప్పనిసరి
వసతి కల్పించిన 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో వివరాలు అందించాలి… హోటళ్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచనలు… నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు: సీపీ రాజశేఖరబాబు…

విజయవాడ: ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశీయులకు ఆశ్రయం, వసతి కల్పించే యాజమాన్యాలు వారి వివరాలను నిర్దేశిత విధానంలో ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు సూచించారు. విదేశీయుల రాక, బస, బయలుదేరే వివరాలను 24 గంటల్లోగా సంబంధిత విదేశీయుల నమోదు అధికారులకు అందించాలని తెలిపారు. విద్య, వైద్యం, పర్యటన, ఇతర అవసరాల కోసం నగరానికి వచ్చే విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, అతిథిగృహాలు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లు అద్దెకిచ్చే యజమానులు కూడా పోలీసుల సూచనల మేరకు వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. విదేశీయుల పాస్‌పోర్టు, వీసా, వ్యక్తిగత వివరాలు, వచ్చిన తేదీ, వసతి చిరునామా తదితర సమాచారాన్ని విదేశీయుల నమోదు వెబ్‌సైట్�లో నిర్దేశిత విధానంలో నమోదు చేయాలని సూచించారు. వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధికి వచ్చే విదేశీయులు భారత చట్టాలను గౌరవిస్తూ, చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రాలు కలిగి ఉండాలని సీపీ పేర్కొన్నారు. విదేశీ పౌరసత్వం కలిగిన భారత సంతతి కార్డుదారులకు దేశంలో ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండవని, వ్యవసాయ భూములు కొనుగోలు చేయరాదని తెలిపారు.

