నిరుపేదల వైద్యానికి రూ.24.98 లక్షల భరోసా
ముగ్గురు బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల మంజూరు... నవజాత శిశువు చికిత్సకు రూ.12.68 లక్షల సాయం... ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబాల కృతజ్ఞతలు...

విజయవాడ, సెప్టెంబర్ 28: నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముగ్గురు బాధితులకు రూ.24.98 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాలను మంజూరు చేయించారు. ఆయన ఆదేశాల మేరకు భవానీపురంలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి నాయకులు బాధిత కుటుంబాలకు పత్రాలను అందజేశారు. వించిపేటకు చెందిన ముకేష్ చాబ్రియా శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ వైద్యసాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.8 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. కొత్తపేటకు చెందిన నాగ జీవన్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆయన చికిత్స కోసం రూ.4.30 లక్షల ఎల్‌ఓసీ అందించారు. అలాగే 38వ డివిజన్‌కు చెందిన కాగిత బిందు రామలక్ష్మి ఒకరోజు వయసున్న నవజాత శిశువు అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.12.68 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేశారు. అత్యవసర సమయంలో వేగంగా స్పందించి వైద్యసాయం అందేలా చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తెదేపా నాయకులు కొప్పుల గంగాధర్, ఈగల సాంబశివరావు, బొడ్డుపల్లి శ్రీనివాస్, బెవర శ్రీనివాస్, పచ్చవ మల్లికార్జునరావు బాధిత కుటుంబాలకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు.

