ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బాడిత యమున
జనసేన తరఫున 41వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్… కూటమి మద్దతుతో గెలుస్తానని ధీమా… కుమార్తెను ఆశీర్వదించాలని బాడిత శంకర్ విజ్ఞప్తి…

విజయవాడ, అక్టోబర్ 17: ప్రజల ఆమోదంతో గెలిచి నగరపాలక సంస్థలో అడుగుపెడతానని విజయవాడ 41వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి బాడిత యమున అన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఈ డివిజన్ నుంచి ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేశారు. జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్, స్థానిక ఎన్నికల పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త బాడిత శంకర్ కుమార్తె అయిన యమునకు పార్టీ నాయకులు మద్దతుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా యమున మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కూటమి పార్టీల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత డివిజన్లోని ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో రాజీలేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. బాడిత శంకర్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంతోపాటు నగర ప్రజలకు సేవలందించానన్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను నేతృత్వంలో తన కుమార్తెకు పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు, అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. యమునకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వంగవీటి రాధాకృష్ణకు సైతం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గంజి పవన్, ఆంధ్రప్రదేశ్ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కర్ణం దివాకర్, కృష్ణాజిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ రాజా నాయుడు, గుండాల నాని తదితరులు పాల్గొన్నారు.

