భక్తుల రద్దీ వేళ ట్రాఫిక్‌పై ప్రత్యేక నిఘా
మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు… ప్రధాన కూడళ్లలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం… వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా సిబ్బందికి సూచనలు…

విజయవాడ, అక్టోబర్ 16: మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో నగరంలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలతో పాటు ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. భక్తులు, ప్రయాణికులు, నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు వినాయకుడి గుడి, ఆర్టీసీ బస్టాండ్, కుమ్మరిపాలెం తదితర ప్రాంతాలను డీసీపీ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు చేశారు. రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ, వాహనాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన మార్గాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, భక్తులు, సాధారణ ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

