పేదల ముంగిట పింఛన్ భరోసా
గుడివాడ 12వ వార్డులో ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము… లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకొని సమస్యలపై ఆరా… పారిశుధ్యం, రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు చేపడతామని హామీ…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, అక్టోబర్ 1: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేదలకు ప్రతి నెలా ఆర్థిక ఆసరాగా నిలుస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో బుధవారం ఆయన కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.4 వేల పింఛన్ నగదును అందజేశారు. ప్రతి లబ్ధిదారుడిని ఆత్మీయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డులో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే రాము అక్కడికక్కడే మున్సిపల్ అధికారులను పిలిపించారు. చెత్త తొలగింపు, కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి లబ్ధిదారుల ఇంటి వద్దకే అందిస్తున్నామని

ఎమ్మెల్యే తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గుడివాడ పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రతి వీధిలో మెరుగైన రహదారులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతులను ప్రణాళికాబద్ధంగా కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము తెలిపారు. వారి నాయకత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, కూటమి నాయకులు, 12వ వార్డు ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

