ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పారిశుద్ధ్యం
అక్రమంగా చెత్త వేస్తే జరిమానాలు విధించాలి… ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ… కర్నూలులో ఆరు లక్షల టన్నుల పాత చెత్త తొలగింపునకు ప్రత్యేక ప్రణాళిక…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
కర్నూలు, అక్టోబరు 6: ప్రజల సహకారంతో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు కాలుష్య నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో కలిసి మున్సిపల్, పంచాయతీ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ అట్టాడ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ క్యామర్ పాల్గొన్నారు. కృష్ణయ్య మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే వ్యర్థాల విభజన, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. మార్కెట్లు, రైతుబజార్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే వేసేలా బాధ్యతలు నిర్ణయించాలన్నారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలకు ప్రత్యేక సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గుర్తింపు పొందిన వాహనాలు, యాప్ ఆధారిత పర్యవేక్షణ, నిఘా కెమెరాలతో అక్రమంగా చెత్త వేయడాన్ని అరికట్టి, ఉల్లంఘనలకు జరిమానాలు విధించాలని ఆదేశించారు. డ్రైనేజీలు, గ్రామాల ప్రవేశ ప్రాంతాలు, రహదారుల వెంట చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ను దశలవారీగా తగ్గిస్తూ వస్త్రం, జనపనార, కాగితపు సంచులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లలో చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్వహణకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఆస్పత్రులు, పాఠశాలల పరిసరాల్లో నిబంధనల మేరకు శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలని చెప్పారు. వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు నిరంతరం పనిచేయాలి పట్టాభిరామ్ మాట్లాడుతూ ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు,

గూడూరు పట్టణాల్లో ఇంటింటి చెత్త సేకరణకు విద్యుత్ వాహనాలను వినియోగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన చోట విద్యుత్ ఆటోలను సేవా విధానంలో అందుబాటులోకి తేవాలన్నారు. ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, కంపోస్టు నాణ్యతను పరీక్షించి మార్కెట్‌తో అనుసంధానించాలని చెప్పారు. పొడి వ్యర్థాలను రకాల వారీగా వేరు చేసి పునర్వినియోగ సంస్థలకు అందించాలన్నారు. జిల్లాలోని 17 రూర్బన్ గ్రామ పంచాయతీల్లో పాత చెత్త నిల్వల సర్వేను త్వరగా పూర్తి చేసి, దశలవారీగా తొలగించాలని ఆదేశించారు. ప్రాసెసింగ్ కేంద్రాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించి అవసరమైన చోట సౌర విద్యుత్‌ను వినియోగించాలని సూచించారు. పాత చెత్త తొలగింపుపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ సిరి మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ నుంచి శాస్త్రీయ ప్రాసెసింగ్ వరకు వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. నగరంలో పేరుకుపోయిన సుమారు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పాత చెత్తను దశలవారీగా తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. డ్రైనేజీ సమస్యలను ప్రాంతాల వారీగా గుర్తించి శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. కేసీ కాలువ పరిసరాల్లో నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, సుమారు 12 కిలోమీటర్ల మేర కాలువలోకి చెత్త చేరకుండా రక్షణ చర్యలను వేగవంతం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాల పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ హుసేన్ పీరా, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

