భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు నిరంతరం పనిచేసేలా నియంత్రణ గదుల ఏర్పాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా కేంద్రాల్లో నియంత్రణ గదులను ఏర్పాటు చేసి, అవి ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అధికారులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

