స్థానిక పోరుకు వైసీపీని సిద్ధం చేస్తున్న జగన్
ప్రతి స్థానంలో పోటీ.. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని దిశానిర్దేశం... నియోజకవర్గాల్లో లీగల్, మీడియా సెల్లతో పాటు సోషల్ మీడియాను బలోపేతం చేయాలని సూచన... సెప్టెంబర్ 5 నుంచి సంస్థాగత సమావేశాలు.. 23 నుంచి ఇంటింటి ప్రచారానికి కార్యాచరణ...

తాడేపల్లి, ఆగస్టు 25: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్గా తీసుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సమావేశమైన ఆయన స్థానిక ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి వచ్చే పరిస్థితుల్లో ప్రతి ప్రాంతంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని జగన్ సూచించారు. ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో వైయస్సార్సీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని స్పష్టం చేశారు. బలమైన అభ్యర్థి మిగిలిన స్థానాల్లోనూ పార్టీకి బలం చేకూర్చడంతో పాటు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించగలడని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని జగన్ పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమికి వ్యతిరేక ఓటు నమోదవుతుందని, వైయస్సార్సీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను ప్రస్తుత ప్రభుత్వ పాలనతో ప్రజలు పోల్చి చూస్తున్నారని ఆయన అన్నారు.
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్ ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. పార్టీ కార్యకర్తలకు న్యాయపరంగా అండగా నిలిచేందుకు లీగల్ సెల్, పార్టీ కార్యక్రమాలు, గత ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా సెల్ పటిష్టంగా పనిచేయాలని సూచించారు. సోషల్ మీడియా వేదికలను సమర్థంగా వినియోగించుకునేలా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐదు ప్రధాన అంశాలతో సంస్థాగత కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వైయస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమం, సంస్కరణలను వివరించడం, పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడం, గుర్తింపు కార్డుల పంపిణీ, మండల–గ్రామ–వార్డు స్థాయిలో ఇంటింటి ప్రచారం చేపట్టడం ఇందులో ప్రధాన అంశాలుగా నిర్ణయించారు.
ఈ మేరకు సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలు, సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు, సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారితో పాటు ప్రజల్లో ఆమోదం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని, వీలైనంత వరకు ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

