‘అఖండ గోదావరి’గా పుష్కరాలకు మహా ప్రణాళిక
రూ.4,026 కోట్లతో 4,932 పనులు.. 440 పుష్కర ఘాట్లకు కార్యాచరణ... 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ... పవిత్రత, భద్రత, ప్రపంచస్థాయి సౌకర్యాలకు పెద్దపీట: సీఎం చంద్రబాబు...

అమరావతి, ఆగస్టు 25: ప్రకృతి ఆరాధనకు, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా నిలిచేలా 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పవిత్రతకు ఎక్కడా భంగం కలగకుండా చూడడంతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. మొత్తం రూ.4,026 కోట్లతో 4,932 పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. పుష్కరాలకు మరో పది నెలల సమయమే ఉన్నందున పనులను వేగంగా ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
2015 మహా పుష్కరాల్లో రాష్ట్రంలో సుమారు 4.86 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా, 2027 పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 181 కొత్త ఘాట్లను నిర్మించనున్నారు.
తూర్పుగోదావరిలో 82, పశ్చిమగోదావరిలో 40, కోనసీమలో 175, ఏలూరులో 44, కాకినాడలో 88, పోలవరం జిల్లాలో 11 ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. ఆరు జిల్లాల్లో రహదారులపై గుంతలు కనిపించకుండా చర్యలు చేపట్టాలని, ఘాట్లకు అనుసంధాన రహదారులను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు.
ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం
గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టెంపుల్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. పిఠాపురం శక్తిపీఠంతో పాటు పంచారామ క్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది తదితర ఆలయాలను అనుసంధానం చేయాలని చెప్పారు. భక్తుల వసతి కోసం హోమ్‌స్టేలను ప్రోత్సహించడంతో పాటు కొత్త హోటళ్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని సూచించారు.
రద్దీ నియంత్రణకు ఏఐ
పుష్కరాల్లో భద్రత, రద్దీ నిర్వహణకు ఏఐ ఆధారిత క్రౌడ్ అనలిటిక్స్, సీసీటీవీ ఎంట్రీ–ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వైలెన్స్, క్యూఆర్ ఆధారిత వాహన గుర్తింపు వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, మెడికల్ క్యాంపులతో పాటు 30 తాత్కాలిక ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నారు.
నదిలో భక్తుల భద్రత కోసం 2,697 రెస్క్యూ బోట్లు, 8,955 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లను సిద్ధం చేయనున్నారు. కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించేందుకు 487 గ్రీన్ ఎనర్జీ బస్సులను వినియోగించడంతో పాటు 11 బస్స్టేషన్లను ఆధునీకరించనున్నారు.
గోదావరిలోకి మురుగు చుక్క కూడా వెళ్లొద్దు
గోదావరిలో ఒక్క చుక్క మురుగు నీరు కూడా కలవకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. హేవ్‌లాక్ బ్రిడ్జి, సమీప దీవుల అభివృద్ధితో పాటు రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును భక్తులు, పర్యాటకులు సందర్శించేలా రహదారి సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని 260 గ్రామ పంచాయతీల్లో 50 గ్రామాలను మోడల్ పుష్కర పంచాయతీలుగా అభివృద్ధి చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలిని పైలట్ మోడల్ పుష్కర పంచాయతీగా ఎంపిక చేశారు.
గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు ఉపనదులు, వాగులు, ఏరులను కూడా పుష్కరాల భావనలో భాగం చేస్తూ ‘అఖండ గోదావరి’ పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, వై. సత్యకుమార్ యాదవ్, గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

