స్థానిక పోరుకు కూటమి సిద్ధం కావాలి
ప్రతి వార్డులో సమన్వయంతో పనిచేయాలి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి కూటమి శ్రేణులకు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పిలుపు

నందిగామ, సెప్టెంబర్ 23 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొనేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. కాకానినగర్లోని తన కార్యాలయంలో బుధవారం సమన్వయ కమిటీ సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. ప్రతి వార్డులో కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషి చేయడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. వాతావరణ మార్పులపై రైతులు అప్రమత్తంగా ఉండాలి ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడి వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు, రైతు సంఘాలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సౌమ్య సూచించారు. రైతులకు అవసరమైన సమాచారం, ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా కూటమి నాయకులు అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులపై దాడి దురదృష్టకరం ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. నిరసన పేరుతో హింస, విధ్వంసానికి పాల్పడటం సమర్థనీయం కాదన్నారు. శాప్ కార్యాలయం వద్ద పోలీసులను దాటుకొని దాడులకు దిగడం దురదృష్టకరమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. గణనాథుడికి సౌమ్య ప్రత్యేక పూజలు కాకానినగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ప్రశాంత్ కుటుంబానికి పరామర్శ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఐలపోగు ప్రశాంత్ తల్లి రాజేశ్వరి మృతి చెందడంతో అంబారుపేటలోని వారి నివాసానికి ఎమ్మెల్యే సౌమ్య వెళ్లారు. రాజేశ్వరి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శివకుమార్ కుటుంబానికి ఉమా, సౌమ్య పరామర్శ కంచికచర్ల: పరిటాల గ్రామ టీడీపీ అధ్యక్షుడు పరిటాల శివకుమార్ తల్లి సుమతి పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. సుమతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

