మహిళల స్వయం ఉపాధికి చేయూత
ఇద్దరు మహిళలకు కుట్టుమిషన్లు అందజేసిన బొండా సిద్ధార్థ… నిరంతర ఆదాయం పొందేలా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం… అవసరమైన వారికి జీవనోపాధి సహాయం కొనసాగిస్తామని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 7: మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ అన్నారు. బుధవారం సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 62వ డివిజన్ పైపుల రోడ్డుకు చెందిన దాశెట్టి జ్యోతి, నక్కా సత్యలకు జీవనోపాధి నిమిత్తం ఆయన కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ మహిళలు నిరంతరం ఆదాయం పొందేందుకు ఉపాధి మార్గాలను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమన్నారు. కుట్టుమిషన్లతో ఇంటి వద్దనే పనిచేస్తూ కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ఉపాధి ప్రారంభించలేని వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అర్హత, అవసరాన్ని గుర్తించి రాబోయే రోజుల్లోనూ కుట్టుమిషన్లు, ఇతర ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. పేద కుటుంబాలు స్వయంగా ఆదాయం సంపాదించుకునేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు. కుట్టుమిషన్లు అందుకున్న జ్యోతి, సత్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, డివిజన్ ఇన్‌చార్జి పైడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

