దసరా ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష.. భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం
► కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... ► దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి... ► భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఈవో శీనా నాయక్, ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మంత్రి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వీఐపీ దర్శనాలతో పాటు సాధారణ భక్తుల దర్శనం కూడా సజావుగా కొనసాగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతంగా పూర్తి చేసి, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రతిష్టకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా నిర్వహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

