నాగాయలంకలో రెపరెపలాడిన 112 అడుగుల జాతీయ పతాకం
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఎల్-నీనో కరవును ధైర్యంగా ఎదుర్కొందాం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే కృష్ణానది ఒడ్డున భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ.. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని పిలుపు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 (V10TV AP): నాగాయలంకలో కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేసిన 112 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. పర్రచివర గ్రామానికి చెందిన యర్రాపాత్రుని సూర్య నాయుడు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ జాతీయ పతాకాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి విక్కుర్తి శ్రీనివాసరావుతో కలిసి బుద్ధప్రసాద్ ఆవిష్కరించి, శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందించేలా 112 అడుగుల జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, జెండా వీరుడు తోట నరసయ్య నాయుడు వంటి మహనీయులతో అవనిగడ్డ ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను నేటి తరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కుల, మత, ప్రాంతీయ భావాలకు అతీతంగా దేశభక్తితో ముందుకు సాగాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో సామాన్యుడి

పాత్ర ఏమిటో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. సామాన్యులు చట్టసభలకు వెళ్లినప్పుడే ప్రజల గొంతు బలంగా వినిపిస్తుందని పేర్కొన్నారు. ఎల్-నీనో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని సూచించారు. గతంలో ఎన్నో కరువులను ఎదుర్కొన్న ఈ ప్రాంత ప్రజలు ప్రస్తుత పరిస్థితినీ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు. రైతులకు అండగా ఉంటామని, ఏ ఒక్క రైతు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ నాయకుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 112 అడుగుల జాతీయ పతాకం ఏర్పాటుకు సహకరించిన సూర్య నాయుడును అతిథులు ఘనంగా సత్కరించారు.

