స్థానిక పోరుకు అధికార యంత్రాంగం సన్నద్ధం!
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం… మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కసరత్తు… ఎన్నికలకు 4,800 బ్యాలెట్ బాక్సులు అవసరం.. అందుబాటులో 7,900…

విజయవాడ, అక్టోబర్ 9: ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన సామగ్రి, బ్యాలెట్ బాక్సుల లభ్యతపై దృష్టి సారించారు.జిల్లాలో 1,104 వార్డులు, 280 ఎంపీటీసీ, 16 జెడ్పీటీసీ స్థానాలతో పాటు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు 4,800 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 7,900 బాక్సులు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాలెట్ బాక్సుల కొరత లేకుండా ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సందడి నెలకొనే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే గ్రామాలు, పట్టణాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల తేదీలు, రిజర్వేషన్లు, తుది స్థానాల వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

