ఆంధ్రరత్న భవన్‌లో జాతిపితకు ఘన నివాళి
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు… సత్యం, అహింస, దేశభక్తిని స్మరించుకున్న కాంగ్రెస్ నేతలు… మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాలని పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, సామాజిక న్యాయం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శమని నాయకులు కొనియాడారు. నిరాడంబరత, నిజాయతీ, దేశభక్తికి లాల్ బహదూర్ శాస్త్రి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలు, విలువలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కొలనుకొండ శివాజీ, బైపూడి నాగేశ్వరరావు, షేక్ ఖుర్షిదా, నరహరిశెట్టి నరసింహారావు, ధనేకుల మురళి, బొర్రా రవిచంద్ర, పి.వై. కిరణ్, మీసాల రాజేశ్వరరావు, అల్లం రాజేష్, బేగ్, రాచర్ల ప్రకాష్, బాజీ సయ్యద్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

