బీసీలకు న్యాయమే ప్రభుత్వ లక్ష్యం
స్థానిక సంస్థల్లో సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం… రిజర్వేషన్లపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి ముందడుగు… అపోహలకు తావివ్వకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలి: బొండా ఉమా…

విజయవాడ, అక్టోబరు 5: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బీఆర్‌టీఎస్ రోడ్డులోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోందన్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రిజర్వేషన్ల అంశంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడంతోపాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో డివిజన్ల పునర్విభజన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగుతోందన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రిజర్వేషన్ల విషయంలో అపోహలకు తావివ్వకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త నవనీత సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు.

