పులి అడుగులు.. పల్లెల్లో అలజడి!
తాళ్లపూడి పరిసరాల్లో పెద్దపులి పాదముద్రల గుర్తింపు… కదలికల నిఘాకు ౧౫ కెమెరాలు.. సిద్ధంగా బోను… తెల్లవారుజామున పొలాలకు వెళ్లొద్దంటూ గ్రామాల్లో దండోరా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
తాళ్లపూడి: తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. తాళ్లపూడి, గోపాలపురం, పోలవరం మండలాల పరిధిలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేశారు. పాదముద్రలు, గతంలో పులికి అమర్చిన జీపీఎస్ పరికరం ఆధారంగా దాని కదలికలను పరిశీలిస్తున్నారు. సీతానగరం నుంచి గోదావరి నదిని దాటి పోలవరం మండలం గూటాల మీదుగా గోపాలపురం మండలం గోపవరం వైపు పులి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి తాళ్లపూడి మండలంలోని బయ్యవరం, తుపాకులగూడెం, రాగోలపల్లి పరిసరాల్లో సంచరించినట్లు పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు.

ఆయిల్‌పామ్ తోట నుంచి పాత్రునిచెరువు ఆయకట్టు మీదుగా ఎలుగుకొండ వైపు వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. పులి ఆచూకీ కోసం అటవీశాఖ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. జీపీఎస్ పరికరం ద్వారా ప్రతి మూడు నుంచి ఐదు గంటలకోసారి కదలికల సమాచారం అందుతోందని అధికారులు పేర్కొన్నారు. నిఘా కోసం ౧౫ కెమెరాలు అమర్చామని, ఒక బోను సిద్ధం చేశామని డిప్యూటీ రేంజ్ అధికారి ఎ. సూరిబాబు తెలిపారు. తెల్లవారుజామున రైతులు, కూలీలు పంటపొలాలకు వెళ్లవద్దని, చీకటి పడిన తర్వాత బయట సంచరించవద్దని అధికారులు సూచించారు. అటవీ, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు.

