ధాన్యం డబ్బుల కోసం రైతుల ఆగ్రహం
సూరంపల్లి రైతు సేవా కేంద్రం వద్ద కౌలు రైతుల ఆందోళన... ఆరు రోజులుగా నిరసన.. చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ... పంచాయతీ, రైతు సేవా కేంద్రం గేట్లకు తాళాలు.. పోలీసులతో తోపులాట...

గన్నవరం, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): తమకు రావాల్సిన ధాన్యం విక్రయాలకు సంబంధించిన డబ్బులు చెల్లించాలంటూ కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో కౌలు రైతులు శనివారం ఆందోళనకు దిగారు. సూరంపల్లి రైతు సేవా కేంద్రం వద్ద గత ఆరు రోజులుగా నిరసన కొనసాగిస్తున్న రైతులు శనివారం తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.
తాము విక్రయించిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము ఇప్పటికీ తమకు అందలేదని రైతులు వాపోయారు. రైతు సేవా కేంద్రానికి సంబంధించిన సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్ వ్యవహారశైలిపై వారు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు పక్కదారి పట్టాయని ఆరోపిస్తూ, దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
గేట్లకు తాళాలు.. ఉద్రిక్తత
తమకు రావాల్సిన డబ్బులపై సంబంధిత అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు తేల్చిచెప్పారు. పంచాయతీ కార్యాలయం, రైతు సేవా కేంద్రం సిబ్బందిని విధులకు వెళ్లనివ్వకుండా గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించిన సమయంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తమ సమస్యకు పరిష్కారం చూపకుండా ఆందోళనను అడ్డుకోవడం సరికాదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న గన్నవరం తహసీల్దార్ శివయ్య సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ధాన్యం డబ్బుల చెల్లింపులకు సంబంధించిన అంశంపై వివరాలు తెలుసుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
కాగా, ధాన్యం సొమ్ము పక్కదారి పట్టిందన్న రైతుల ఆరోపణలపై సంబంధిత రైతు సేవా కేంద్రం అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్ వివరణ తెలియాల్సి ఉంది.

