వాట్సాప్ ఫొటోలతోనే సమస్యకు పరిష్కారం!
నగరవనంలో వాకింగ్ ట్రాక్‌కు అడ్డంకులు తొలగింపు… వాకర్స్ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు… డిప్యూటీ రేంజ్ అధికారి పోతురాజుకు వాకర్స్ కృతజ్ఞతలు…

విజయవాడ, నవంబర్ 10 : ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే కేవలం వాట్సాప్ ద్వారా పంపిన ఫొటోలతో ఓ సమస్యకు పరిష్కారం లభించింది. విజయవాడ సమీపంలోని నగరవనంలో వాకింగ్ ట్రాక్‌పై పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని వాకర్స్ చేసిన విజ్ఞప్తిపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. సమస్యను గుర్తించి సత్వర చర్యలు చేపట్టడంపై వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన నగరవనం నిత్యం వందలాది మంది సందర్శకులు, వాకర్స్‌తో కళకళలాడుతోంది. ఇక్కడి వాకింగ్ ట్రాక్, వ్యాయామ పరికరాలు, ఆట వస్తువులు ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. అయితే ఇటీవల వరుస తుఫాన్లు, వర్షాల కారణంగా నగరవనానికి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రమంలో వాకింగ్ ట్రాక్‌పై పచ్చగడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి కాలిబాటకు అడ్డంకిగా మారాయి. దీంతో నడక కోసం వచ్చే వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన వాకర్స్ వాకింగ్ ట్రాక్ పరిస్థితిని ఫొటోలు తీసి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి పులివర్తి పోతురాజుకు వాట్సాప్ ద్వారా పంపించారు. ఫొటోలు అందిన వెంటనే స్పందించిన ఆయన ట్రాక్టర్ బ్లేడు సహాయంతో పచ్చగడ్డి, పిచ్చిమొక్కలను తొలగించేలా చర్యలు చేపట్టారు. దీంతో వాకింగ్ ట్రాక్‌పై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కేవలం వాట్సాప్ సందేశంతోనే సమస్యను పరిష్కరించిన డిప్యూటీ రేంజ్ అధికారి పోతురాజు పనితీరును వాకర్స్ అభినందించారు. ప్రజల సమస్యలపై అధికారులు ఇలాగే తక్షణం స్పందిస్తే ప్రభుత్వ సేవలపై మరింత నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. నగరవనం సందర్శకులు, వాకర్స్ అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

