గర్భిణుల ఆరోగ్యానికి సుజనా ఫౌండేషన్ భరోసా!
హెచ్బీ కాలనీలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం… 15 మంది గర్భిణులకు 2డీ ఎకో కార్డియాక్ స్క్రీనింగ్ పరీక్షలు… గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడమే లక్ష్యం…

విజయవాడ, నవంబర్ 10 : గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు సుజనా ఫౌండేషన్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ఉచితంగా అత్యాధునిక వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం హెచ్బీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన ఉచిత మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ శిబిరానికి స్థానిక గర్భిణులు హాజరయ్యారు. 15 మందికి ఉచిత గుండె పరీక్షలు మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో 15 మంది గర్భిణులకు 2డీ ఎకో మెటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గర్భధారణ సమయంలో మహిళల్లో తలెత్తే గుండె సంబంధిత సమస్యలు, ఆరోగ్యపరమైన ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్య సిబ్బంది వివరించారు. అవసరమైన సందర్భాల్లో సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. పేద, మధ్యతరగతి మహిళలకు చేయూత ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోలేని గర్భిణులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సుజనా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొబైల్ హెల్త్ స్క్రీనింగ్ ద్వారా మహిళలకు అందుబాటులోనే పరీక్షలు నిర్వహించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. గర్భిణుల ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి అవసరమైన వైద్య సలహాలు అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వైద్య శిబిరంలో పలువురి సేవలు ఈ శిబిరంలో డాక్టర్ ఎన్.వంశీ, 2డీ ఎకో టెక్నీషియన్లు సుప్రియ, సింధుప్రియ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. అలాగే 38వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు, 39వ డివిజన్ జనసేన కార్పొరేటర్ తిరుపతి అనూష, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, టీడీపీ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు తదితరులు పాల్గొని శిబిర నిర్వహణకు సహకరించారు.

