75, 66వ డివిజన్లలో కూటమి నేతల ఇంటింటి ప్రచారం
బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా బొండా ఉమా, వంగవీటి రాధాకృష్ణ ప్రచారం... ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమన్న బొండా ఉమామహేశ్వరరావు... ప్రతి డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్న రాధాకృష్ణ...

విజయవాడ, అక్టోబర్ 29 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 75, 66వ డివిజన్లలో గురువారం ఎన్డీఏ కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. 75వ డివిజన్ మధ్యకట్ట బుడమేరు వంతెన వద్ద ప్రారంభమైన ప్రచారంలో స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 75వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బొమ్మదేవర రత్నకుమారి, 66వ డివిజన్ జనసేన అభ్యర్థి మట్ల రవీంద్రకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై స్పందించే పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే పౌర సేవలను మరింత మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఆయా డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి అభ్యర్థులను పరిచయం చేస్తూ వారి తరఫున మద్దతు కోరారు. స్థానికులు ప్రస్తావించిన సమస్యలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి బొమ్మదేవర రత్నకుమారి, జనసేన అభ్యర్థి మట్ల రవీంద్రతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

