మూడు ముళ్లకు ముందే శక్తి టీమ్ బ్రేక్!
ఏలూరులో బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు... సమాచారం అందగానే పాములదిబ్బకు శక్తి టీమ్... బాలికల భవిష్యత్తుతో ఆడుకోవద్దని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్...

ఏలూరు, నవంబర్ 4: బాల్య వివాహానికి సిద్ధమైన కుటుంబ సభ్యులకు ఏలూరు జిల్లా శక్తి టీమ్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. మూడు ముళ్లు పడకముందే రంగంలోకి దిగి బాలిక భవిష్యత్తును కాపాడే చర్యలు చేపట్టారు. ఏలూరు ఆర్‌ఆర్ పేటలోని పాములదిబ్బ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు శక్తి టీమ్ సభ్యులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. చదువుకోవాల్సిన వయసులో పెళ్లా? ఈ సందర్భంగా మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్యం చదువుకు, కలల సాకారానికి పునాది కావాలని, పెళ్లి పేరుతో బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని సూచించారు. చిన్న వయసులో వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని వివరించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని ప్రోత్సహించినా, నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. బాలికలను ఉన్నతంగా చదివించి వారి లక్ష్యాలను సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని స్పష్టం చేశారు.

