ముందు మున్సిపల్.. ఆపై పరిషత్ పోరు!
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన... అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ మంత్రులకు సూచన... తొలుత మున్సిపాలిటీలు.. తర్వాత MPTC, ZPTC.. ఆపై సర్పంచ్ ఎన్నికలంటూ స్పష్టీకరణ...

అమరావతి, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులోగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. స్థానిక ఎన్నికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ మంత్రులతో జరిగిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో స్థానిక ఎన్నికల అంశాన్ని లోకేశ్ ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని, అక్టోబరులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణ క్రమంపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. తొలుత మున్సిపాలిటీ ఎన్నికలు, అనంతరం MPTC, ZPTC ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ మరింత ఊపందుకుంది.

