దళిత కుటుంబంపై దాడి.. ఇంటికి తాళం!
వ్యవసాయ భూమి వివాదంలో దౌర్జన్యం జరిగిందంటూ ఆరోపణ... ఇంటి నుంచి బయటకు ఈడ్చి కొట్టి.. చంపేస్తామంటూ బెదిరించారని ఫిర్యాదు... పెదయాదర ఘటనపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్...

మచిలీపట్నం, సెప్టెంబర్ 3: బందరు మండలం పెదయాదర గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో ఓ దళిత కుటుంబంపై దాడి చేసి, వారు నివసిస్తున్న ఇంటికి తాళం వేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. బాధిత కుటుంబాన్ని గ్రామం నుంచి వెళ్లిపోవాలని బెదిరించినట్లు కృష్ణాజిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దోవా గోవర్ధన్ ఆరోపించారు.
పొనుగుమాటి మాధురి కుటుంబం గ్రామంలోని సుమారు 20 సెంట్ల భూమిని వారసత్వంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సరిహద్దు భూమికి సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం పలువురు మాధురి ఇంటిపైకి వచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
మాధురిని ఇంటి నుంచి బయటకు ఈడ్చి కొట్టి, అనంతరం ఇంటికి తాళం వేశారని, ఎవరైనా తాళం తీస్తే చంపేస్తామని, పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరించినట్లు గోవర్ధన్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు కూడా హెచ్చరించారని ఆరోపించారు.
ఈ ఘటనను కృష్ణాజిల్లా మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తున్నట్లు గోవర్ధన్ తెలిపారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
