ఆహార కమిషన్ తనిఖీ.. బయటపడ్డ లోపాలు
అంగన్వాడీల్లో భౌతిక హాజరుకు.. ఆన్లైన్ లెక్కలకు పొంతన కరువు... టీచర్, సూపర్వైజర్కు షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశం... ఆకస్మిక తనిఖీల్లో లోపాలను గుర్తించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి...

గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 2: అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న ఆహార సరఫరా, హాజరు నమోదు, గుడ్ల స్టాక్ నిర్వహణలో పలు లోపాలు వెలుగుచూశాయి. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ. లక్ష్మీరెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భౌతిక హాజరుకు ఆన్లైన్ లెక్కలకు వ్యత్యాసాలతో పాటు గుడ్ల స్టాక్ రిజిస్టర్లోనూ భారీ తేడా కనిపించింది.
అంగలూరు అంగన్వాడీ కేంద్రంలో మొత్తం తొమ్మిది మంది పిల్లలకు గాను ఏడుగురు మాత్రమే భౌతికంగా హాజరై ఉండగా, ఆన్లైన్లో తొమ్మిది మంది హాజరైనట్లు నమోదు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యత్యాసంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
గుడ్లవల్లేరు–1 అంగన్వాడీ కేంద్రంలో నలుగురు పిల్లలు భౌతికంగా హాజరై ఉండగా, ఆన్లైన్లో ముగ్గురి హాజరు మాత్రమే నమోదైంది. గుడ్ల నిల్వల్లో ఫేజ్–IVకు చెందిన 11 గుడ్లు ఉన్నట్లు గుర్తించారు. సూపర్వైజర్ కేంద్రాన్ని క్రమం తప్పకుండా సందర్శించకపోవడంతో పాటు సందర్శన రికార్డుల్లోనూ లోపాలు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. దీనిపై విచారణ జరిపి సంబంధిత అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను లక్ష్మీరెడ్డి ఆదేశించారు.
గుడ్లవల్లేరు–6 అంగన్వాడీ కేంద్రంలో గత నెలకు చెందిన 270 గ్రీన్ కలర్ గుడ్లు, నాలుగో వారానికి చెందిన 34 బ్రౌన్ కలర్ గుడ్లు, మొదటి వారానికి చెందిన 330 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ కూడా భౌతిక, ఆన్లైన్ హాజరు మధ్య వ్యత్యాసం కనిపించింది. సూపర్వైజర్ క్రమం తప్పకుండా కేంద్రాన్ని సందర్శించకపోవడంపై కమిషన్ సభ్యుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రిజిస్టర్లో 850.. భౌతికంగా 1,310!
జడ్పీహెచ్ గుడ్లవల్లేరు పాఠశాలలో గుడ్ల నిల్వల లెక్కల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. భౌతికంగా 1,310 గుడ్లు ఉండగా స్టాక్ రిజిస్టర్లో 850 గుడ్లు మాత్రమే నమోదై ఉన్నాయి. అంటే ఏకంగా 460 గుడ్ల తేడా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఎంఈఓ ద్వారా సమగ్ర విచారణ, పర్యవేక్షణ జరిపించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 282 మంది విద్యార్థులకు 252 మంది హాజరయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో పాటు మెనూ బోర్డు కూడా ప్రదర్శించలేదని గుర్తించారు. చక్కీలు తదితర ఆహార పదార్థాలను బియ్యం బస్తాల్లో నిల్వ చేయడాన్ని గమనించి, పరిశుభ్రమైన ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా నిల్వ చేయాలని సూచించారు.
అనంతరం గుడివాడ మండల స్థాయి స్టాక్ పాయింట్, పామర్రులోని అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ మహిళా హాస్టల్‌ను లక్ష్మీరెడ్డి తనిఖీ చేశారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యత, పరిమాణం విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని, స్టాక్ రిజిస్టర్లు, హాజరు, పంపిణీ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ ఐ. విమల, డిప్యూటీ డీఈఓ రవికుమార్‌తో పాటు పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ, సంక్షేమ, ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

