బస్సెక్కే వేళ.. వృద్ధురాలి పర్సుకు కన్నం!
బంగారు ఆభరణాలు, నగదు చోరీ.. ఆరుగురి అరెస్ట్... సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన కృష్ణలంక పోలీసులు... ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా అద్దెకు తీసుకుని విజయవాడకు వచ్చినట్లు గుర్తింపు...

విజయవాడ క్రైమ్, సెప్టెంబర్ 3: విజయవాడ బస్టాండ్‌లో వృద్ధురాలి వద్ద ఉన్న పర్సును చోరీ చేసిన ఘటనలో ఆరుగురు నిందితులను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 31న జగ్గయ్యపేట పాయింట్ వద్ద వృద్ధురాలు బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె వద్ద ఉన్న పర్సును నిందితులు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పర్సులో బంగారు ఆభరణాలతో పాటు నగదు ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న కృష్ణలంక పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ప్రొద్దుటూరులో ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని విజయవాడకు వచ్చినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు సమాచారం. చోరీ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పట్టుకున్నట్లు తెలుస్తోంది.
అరెస్టు చేసిన ఆరుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులు తమ నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

