విజయవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: బొండా ఉమా
విజయవాడ రూపురేఖలు మార్చింది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టీకరణ… అభివృద్ధిని అడ్డుకున్న పార్టీలకు ఓట్లు అడిగే అర్హత ఏమిటని ప్రశ్న… కేంద్రం, రాష్ట్రం, నగరంలో కూటమి ఉంటేనే అభివృద్ధి వేగవంతమవుతుందని వ్యాఖ్య…

విజయవాడ, అక్టోబర్ 31: విజయవాడ నగర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర లేదని విమర్శిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, వాటితో కలిసి నడుస్తున్న స్వతంత్ర అభ్యర్థులు గతంలో నగరానికి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. విజయవాడ రూపురేఖలను మార్చిన అనేక కీలక ప్రాజెక్టులు టీడీపీ, గత కూటమి ప్రభుత్వాల హయాంలోనే చేపట్టామని పేర్కొన్నారు. ఆదివారం జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగర ప్రజలు గత చరిత్రను, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ బస్టాండ్, వారధి, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, నగర రహదారులు, పార్కులు, కృష్ణా తీరంలోని ఘాట్లు, కాలువల సుందరీకరణ వంటి అభివృద్ధి పనుల్లో టీడీపీ ప్రభుత్వాల పాత్ర కీలకమని ఆయన వివరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యల పరిష్కారానికి, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కృష్ణలంక ప్రాంతంలో రూ.164 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం, బుడమేరు వరద ముంపు నివారణకు రూ.28 కోట్లతో రక్షణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. బుడమేరు వరద నియంత్రణకు అండర్ టన్నెల్, డ్రైనేజీ చానల్, కొల్లేరు వరకు నీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి వంటి పనులను ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించామని తెలిపారు. జూన్ 2027 నాటికి నిర్దేశిత పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి రూ.500 కోట్లు, జీవో నంబర్ 1142 ద్వారా తాగునీరు, ఓవర్హెడ్ ట్యాంకులు, డ్రైనేజీ తదితర పనులకు రూ.927 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర సహకారంతో అమృత్ పథకం కింద విజయవాడ పరిధిలో రూ.4,300 కోట్ల విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. గన్నవరంలో హెచ్సీఎల్, మల్లవల్లి పారిశ్రామిక పార్కు, మేధా టవర్స్ విస్తరణ, అశోక్ లేలాండ్ వంటి పరిశ్రమలు, ఐటీ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ, అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణం, రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు విజయవాడ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రూ.105 కోట్లతో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునికీకరణకు రూ.60 కోట్లు, నిడమానూరు ఫ్లైఓవర్, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవేల ప్రతిపాదనలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే విజయవాడ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. గత ఐదు దశాబ్దాలుగా విజయవాడ అభివృద్ధికి కమ్యూనిస్టు, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అడ్డంకులు సృష్టించాయని బొండా ఉమా ఆరోపించారు. నగరానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నాలను కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయని విమర్శించారు. లూలూ ప్రాజెక్టు విషయంలోనూ నగర యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. అభివృద్ధిపై విమర్శలు చేసే ముందు ఆయా పార్టీలు తమ హయాంలో సాధించిన ప్రగతిని వివరించాలని సవాల్ విసిరారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలోనూ కూటమి అధికారంలో ఉంటే ప్రభుత్వాల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. ఆదివారం ఓటు వేయనున్న నగర ప్రజలు అభ్యర్థుల పనితీరు, పార్టీల గత చరిత్ర, నగర భవిష్యత్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని బొండా ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

