ఇద్దరు పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ ఏసోబు… శాలువాలతో సత్కరించిన డీసీపీ కె.జి.వి.సరిత… బాధితులకు న్యాయం చేయడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉంటుందని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 31: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు సిబ్బందికి శనివారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. సత్యనారాయణపురంలో విధులు నిర్వహించిన ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, జగ్గయ్యపేటలో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ బెజవాడ ఏసోబు పదవీ విరమణ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కె.జి.వి.సరిత వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ సరిత మాట్లాడుతూ పోలీస్ శాఖలో 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజలకు రక్షణగా నిలిచి సేవలందించడం గొప్ప విషయమన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అందించినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి మరెక్కడా లభించదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసు సిబ్బంది సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. పదవీ విరమణ పొందిన సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య, పోలీస్ కమిషనర్ కార్యాలయ పరిపాలనా సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

