రాప్తాడు పాఠశాలలో దారుణం.. విద్యార్థినిపై రంపంతో దాడి!
తరగతి గదిలోకి చొరబడి చెట్లు కోసే రంపం యంత్రంతో దాడి… తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని… మరో విద్యార్థిపైనా దాడి.. అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలింపు…

అనంతపురం, అక్టోబర్ 31: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలోకి చొరబడిన ఓ యువకుడు పదో తరగతి విద్యార్థినిపై చెట్లు కోసేందుకు ఉపయోగించే రంపం యంత్రంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం గోపిక అనే విద్యార్థినిపై నిందితుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిపైనా దాడి జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితులను పోలీసులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల తరగతి గదిలోనే ఇలాంటి ఘటన జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, అసలు కారణాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. నిందితుడి వివరాలు, మరో బాధితుడి ఆరోగ్య పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

