రహదారిపై నిలిచిన నీటికి దారి
పూడికతీత పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ ఆదేశం ప్రసాదంపాడు శ్మశానవాటిక మార్గంలోని సంపు శుభ్రం రంగంలోకి దిగిన పంచాయతీ అధికారులు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 25: రామవరప్పాడు–ప్రసాదంపాడు జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రసాదంపాడు హిందూ శ్మశానవాటికకు వెళ్లే మార్గంలోని సంపు వద్ద మట్టి పేరుకుపోవడంతో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. సమస్య ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన ఆయన సంపును

తెరిచి పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. డ్రైనేజీ మార్గాన్ని పూర్తిగా శుభ్రం చేసి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన పంచాయతీ అధికారులు రామవరప్పాడు–ప్రసాదంపాడు ప్రాంతంలో పూడికతీత పనులు చేపట్టారు. రహదారిపై నిలిచిన వర్షపు నీటిని తొలగించడంతోపాటు ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

